- ప్రియుడు బహ్రెయిన్‌లో సూసైడ్
- తట్టుకోలేక జగిత్యాలలో ప్రియురాలు బలవన్మరణం
మల్లాపూర్, వెలుగు: వారిద్దరు ప్రేమించుకున్నారు. పెండ్లికి పెద్దలను ఒప్పించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా.. అడ్డంకులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు విదేశంలో, ప్రియురాలు స్వగ్రామంలో ప్రాణాలు తీసుకోవడంతో జగిత్యాల జిల్లాలోని రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు శృతి, పాత దామరాజుపల్లి గ్రామానికి చెందిన మక్కల సాయికుమార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది క్రితం ఉపాధి కోసం సాయికుమార్ బహ్రెయిన్‌కు వెళ్లాడు. వారి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు సుమారు ఏడు నెలల క్రితం నిశ్చితార్థం చేశారు.
ఇటీవల పెళ్లి కోసం సాయికుమార్ బహ్రెయిన్ నుంచి స్వగ్రామానికి రావడానికి సిద్ధమయ్యాడు. అయితే ముందుగా చెల్లెలి పెళ్లి చేయాలని, ఇల్లు చిన్నగా ఉందని కుటుంబ సభ్యులు అతని రాకను నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్ రెండు రోజుల క్రితం బహ్రెయిన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన శృతి ఆదివారం సిరిపూర్‌లోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. శృతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట.. పాడె ఎక్కడంతో ఇరువురి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
